Fiscal Deficit: 2024-25లో ద్రవ్యలోటు పెరుగుదల 5 d ago

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఏప్రిల్- ఫిబ్రవరి వరకు కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.13,46,852 కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో 2024-25కు నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యమైన రూ.15.69 లక్షల కోట్లలో ఈ విలువ 85.80 శాతం. 2023-24 ఇదే కాలంలో ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ లక్ష్యంలో 86.5 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 4.8 శాతానికి, 2025-26లో 4.4 శాతానికి ద్రవ్య లోటును అదుపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్- 2025 ఫిబ్రవరి వరకు పన్ను ఆదాయాలు రూ.20 లక్షల కోట్లు లేదా 2024-25కు బడ్జెట్ సవరణ అంచనాలో 78.8 శాతంగా నమోదయ్యాయి. 2023-24 ఇదే కాలంలో పన్ను ఆదాయాలు అప్పటి బడ్జెట్ లక్ష్యంలో 79.6 శాతంగా ఉన్నాయి.
2024-25 ఏప్రిల్- ఫిబ్రవరిలో ప్రభుత్వ వ్యయాలు రూ.38.93 లక్షల కోట్లు లేదా బడ్జెట్ సవరణ అంచనాలో 82.5 శాతానికి చేరాయి. 2023-24లో ఇదే కాలంలో వ్యయాలు అప్పటి బడ్జెట్ అంచనాలో 93.4 శాతంగా నమోదయ్యాయి. మొత్తం వ్యయాల్లో కేంద్ర ప్రభుత్వ వడ్డీ చెల్లింపులు రూ.9.52 లక్షల కోట్లు కాగా.. ప్రధాన సబ్సిడీల కోసం రూ.3.63 లక్షల కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కింద రూ.11.80 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1.47 లక్షల కోట్లు ఎక్కువ. ద్రవ్యలోటులో ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల మధ్య వ్యత్యాసం ఉంటుంది.